Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

చక్ దే! ఇండియా

Sports | Updated: Jun 18, 2017 01:02 (IST)


చాంపియన్స్ ట్రోఫీలో నేడు పాక్‌తో భారత్‌ ఫైనల్
సంచలనాన్నే నమ్ముకున్న సర్ఫరాజ్ బృందం
ఆత్మ విశ్వాసంతో కోహ్లీ సేన

మళ్లీ... మరోసారి... ఇంగ్లండ్‌ గడ్డపై ఇండో–పాక్‌ వైరం. లీగ్‌ మ్యాచ్‌నే గుడ్లప్పగించి చూశాం. మరి ఫైనలైతేనో... ఒళ్లంతా కళ్లు చేసుకోవాల్సిందే! నిజమే... ఆడేది మైదానంలో... బరిలోకి దిగేది 22 మందే... కానీ కోట్లాది మంది అభిమానులను నిలువెల్లా ఊపేయనుంది. ఈ మైకమంతా మ్యాచ్‌పైనే... క్రీడాభిమానులందర్నీ ఆనందడోలికల్లో ముంచనున్న రెండు దాయాది జట్ల మధ్య అంతిమ సమరానికి ఇంకొన్ని గంటలే మిగిలున్నాయి.  

సోషల్‌ మీడియాలో మాకు మద్దతుగా నిలుస్తున్న పాక్‌ అభిమానులకు కృతజ్ఞతలు. మా జట్టుపై వారు నమ్మకముంచారు. అలాగే ఫైనల్‌ మ్యాచ్‌లోనూ మాకు అండగా నిలవాలని కోరుకుంటున్నాను. మా తొలి మ్యాచ్‌ను భారత్‌ చేతిలోనే ఓడాక మాలో పట్టుదల పెరిగింది. ఆ తర్వాత ఆడిన మ్యాచ్‌ల్లో పాక్‌ ప్రదర్శన చూశాక ఈ విషయం తెలుస్తుంది. జట్టు ఆటగాళ్లలో ప్రేరణ నింపగలిగాను. ఫైనల్‌ మ్యాచ్‌ కోసం యువ ఆటగాళ్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మా స్థాయి ఆటను చూపగలిగితే కచ్చితంగా కప్‌ దక్కించుకుంటాం.  
 – పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌

ఫైనల్‌ మ్యాచ్‌ కోసం మేం ప్రాధాన్యత ఇచ్చే విషయాల్లో సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటం అన్నింటికన్నా ముఖ్యమైనది. అత్యంత కీలకమైన మ్యాచ్‌కు ముందు లేనిపోని విషయాలు కలవరపరుస్తాయి. బ్లూ జెర్సీ ధరించి ఒక్కసారి మైదానంలోకి దిగితే వంద కోట్ల మంది ఆశలు మాపై ఉన్నాయనే ఆలోచన కచ్చితంగా ఒత్తిడి పెంచుతుంది. అభిమా నులు కూడా ఫలితం ఎలా వచ్చినా వాస్తవికంగా ఆలోచించి స్వీకరించాల్సి ఉంటుంది. పాక్‌తో ఫైనల్‌ కోసం మేమేమీ అదనంగా ఉత్సాహపడటం లేదు. – భారత కెప్టెన్‌ కోహ్లి

పాక్‌ ఫైనల్‌ చేరిందిలా...
భారత్‌ చేతిలో 124 పరుగులతో ఓటమి
దక్షిణాఫ్రికాపై 19 పరుగులతో గెలుపు
శ్రీలంకపై 3 వికెట్లతో విజయం
సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 8 వికెట్లతో గెలుపు


భారత్‌ ఫైనల్‌ చేరిందిలా...
పాక్‌పై 124 పరుగులతో గెలుపు
శ్రీలంక చేతిలో 7 వికెట్లతో ఓటమి
దక్షిణాఫ్రికాపై 8 వికెట్లతో గెలుపు
సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై 9 వికెట్లతో విజయం


లండన్‌: ఉరిమే ఉత్సాహంతో ఉన్న జట్టు ఓ వైపు... పడుతూ లేస్తూ ఫైనల్‌ చేరిన జట్టు మరోవైపు... ‘కప్‌’ కోసం కదం తొక్కుతున్నాయి. స్థిరమైన విజయాలతో ముందడుగు వేసిన భారత్‌ చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో నిలకడేలేని చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం అమీతుమీకి సిద్ధమైంది. ఇక్కడ ఐసీసీ ట్రోఫీ కంటే కూడా అసలైన పోరు ప్రతిష్ట కోసమే! ఆటల్లో ఎక్కడైనా... ఎవరైనా... గెలిచేందుకు బరిలోకి దిగితే... దాయాదులు మాత్రం ఇక్కడ గెలిచి తీరేందుకే బరిలోకి దిగుతారు. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, సరిహద్దు పరిస్థితులు ఆట రంగును మార్చి, ఓ యుద్ధం రంగును పులిమాయనడంలో  సందేహం లేదు.

డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఈ టోర్నీలో ఆడిన టీమ్‌లలో అగ్రశ్రేణి జట్టు కోహ్లి సేనే. భారత్‌కు ప్రధాన ఆయుధం బ్యాటింగే.. ఇప్పటికే  టాపార్డర్‌ తమ సత్తా ఏమిటో చూపెట్టింది. శ్రీలంకపై లీగ్‌ దశలో ఓడినప్పటికీ మూడొందలు పైచిలుకు పరుగులు చేసింది. దీంతో ఏ మూల చూసినా, ఎటు నుంచి తూకం వేసినా... పాక్‌పై టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది. అందుకేనేమో కోహ్లి... ఆడేది ఫైనలైనా ఎలాంటి మార్పులు అవసరం లేదని స్పష్టం చేశాడు.

‘ఓపెనింగ్‌’ సూపర్‌ హిట్‌
ఈ టోర్నీలో పాకిస్తాన్‌తో తొలి లీగ్‌ మ్యాచ్‌ నుంచి భారత ఓపెనర్లు ఆకట్టుకున్నారు. ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుడుతున్న శిఖర్‌ ధావన్‌ (317 పరుగులు), రోహిత్‌ శర్మ (304 పరుగులు) ఇద్దరు మూడొందల పైచిలుకు పరుగులు చేశారు. టాపార్డర్‌లో కోహ్లి (253 పరుగులు) జోరు సాగుతోంది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన టాప్‌–5 బ్యాట్స్‌మెన్‌లో ఒక్క భారత్‌ నుంచే ముగ్గురుండటం విశేషం. అనుభవజ్ఞులైన ధోని, యువరాజ్‌లతో అందుబాటులో ఉన్న మిడిలార్డర్‌ కూడా పటిష్టంగా ఉంది. వీరితో పాటు హార్దిక్‌ పాండ్యా, కేదార్‌ జాదవ్‌ సత్తాచాటేందుకు సై అంటున్నారు.

డెత్‌ ఓవర్లలో ఇప్పుడు ధోనిలాగే పాండ్యా కూడా విరుచుకుపడుతున్నాడు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తనదైన శైలిలో బ్యాట్‌ ఝుళిపించగలడు. దీంతో జట్టు భారీస్కోరుకు ఢోకాలేదు. బౌలింగ్‌ విషయానికొస్తే భువనేశ్వర్, బుమ్రా బాగా రాణిస్తున్నారు. ఒక్క లంకతో మ్యాచ్‌ మినహా భారత బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను సమర్థంగా కట్టడి చేశారు. అయితే కుడి మోకాలి బ్యాండెజ్‌తో కనబడుతున్న స్పిన్నర్‌ అశ్విన్‌ ఆడేది అనుమానంగా ఉంది.

నిలకడే అసలు సమస్య
మరోవైపు పాకిస్తాన్‌ జట్టు పరిస్థితి భిన్నంగా ఉంది. ఫైనల్‌ చేరిన జట్టు ప్రతిభను తక్కువ అంచనా వేయకపోయినప్పటికీ పెద్ద స్కోర్లతో గెలిచిన మ్యాచ్‌ ఒక్కటీ లేదు. ఒకరిద్దరి ప్రదర్శనతో బ్యాటింగ్‌లో నెట్టుకొస్తోంది. కొత్త ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ చక్కగా రాణిస్తున్నాడు. టాపార్డర్‌లో బాబర్‌ ఆజమ్‌ సహా కెప్టెన్‌ సర్ఫరాజ్‌లు బాగానే ఆడుతున్నా మిగతా వారి పరిస్థితే కలవరపరుస్తోంది. జట్టులో అందరి కంటే సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ షోయబ్‌ మాలిక్‌ ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చలేదు. బౌలింగ్‌లో మాత్రం ప్రతిభగల యువ పేసర్లతో పటిష్టంగా ఉంది. గత సెమీస్‌కు దూరమైన ఆమిర్‌ ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. హసన్‌ అలీ, జునైద్‌ ఖాన్, కొత్త పేసర్‌ రయీస్‌ గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. అయితే కీలకమైన ఫైనల్లో అసాధారణ ఫామ్‌లో ఉన్న భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలరో లేదో మ్యాచ్‌లోనే చూడాలి.

బెట్టింగ్‌ @ రూ.2 వేల కోట్లు
చాంపియన్స్‌ ట్రోఫీ అంతిమ సమరంలో భారత్, పాక్‌ మ్యాచ్‌పై అభిమానుల ఉత్కంఠ ఎలా ఉన్నా అటు బెట్టింగ్‌ రాయుళ్లు మాత్రం వేల కోట్ల ధనాన్ని గుమ్మరిస్తున్నారు. యూకేలో బెట్టింగ్‌ చట్టబద్ధమే కావడంతో ఆలిండియా గేమింగ్‌ సమాఖ్య (ఏఐజీఎఫ్‌) అంచనా ప్రకారం ఏకంగా రూ.2 వేల కోట్లు చేతులు మారనున్నాయి. నేటి మ్యాచ్‌లో బుకీలు భారత్‌ను ఫేవరెట్‌గా భావిస్తున్నారు. అందుకే భారత్‌పై రూ.100 పందెం కాస్తే దక్కేది రూ.140 మాత్రమే.. అదే పాక్‌ నెగ్గుతుందని బెట్టింగ్‌కు దిగితే ఏకంగా రూ.300 జేబులో వేసుకోవచ్చు. పదేళ్ల కాలంలో తొలిసారిగా ఓ ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడనుండటంతో ఈ స్థాయిలో బెట్టింగ్‌ జరుగుతోందని ఏఐజీఎఫ్‌ పేర్కొంది.  

జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రోహిత్, యువరాజ్, ధోని, హార్దిక్‌ పాండ్యా, జాదవ్, జడేజా, భువనేశ్వర్, జస్‌ప్రీత్‌ బుమ్రా, అశ్విన్‌/ఉమేశ్‌ యాదవ్‌.
పాకిస్తాన్‌: సర్ఫరాజ్‌ (కెప్టెన్‌), ఫఖర్‌ జమాన్, అజహర్‌ అలీ, బాబర్‌ ఆజమ్, షోయబ్‌ మాలిక్, హఫీజ్, హసన్‌ అలీ, రయీస్, ఆమిర్, జునైద్‌ ఖాన్, ఇమాద్‌ వసీమ్‌.

పిచ్, వాతావరణం
ఈ టోర్నీలోనే ఆడని పిచ్‌ ఇది. బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామంలా కనిపిస్తోంది. 300 పరుగుల్ని అవలీలగా చేసేయొచ్చు. వాతావరణం విషయానికొస్తే మేఘావృతంగా కనిపిస్తున్నా వర్షభయం లేదు! ఒకవేళ వర్షంతో ఆటంకం కలిగినా ఫైనల్‌కు రిజర్వ్‌ డే (సోమవారం) ఉంది.

చరిత్ర ఏం చెబుతోందంటే...
దాయాదుల మధ్య గతంలో జరిగిన పలు కీలకమ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లే సత్తాచాటుకున్నారు. అజయ్‌ జడేజా, వెంకటేశ్‌ ప్రసాద్, హృషికేశ్‌ కనిత్కర్, జోగిందర్‌ శర్మ ఇలా వీరంత భారత ఘనతల్లో తమదైన ముద్ర వేశారు. అయితే 2006 ఐసీసీ అండర్‌–19 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌పై పాక్‌ను గెలిపించిన విజయసారథి సర్ఫరాజ్‌. ఆ జట్టులో ఉన్న ఇమాద్‌ వసీమ్‌ ప్రస్తుత జట్టులోనూ ఉన్నాడు. అలాగే భారత జట్టులోనూ అప్పుడు ఆడిన రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా ఉన్నారు.

132 ఐసీసీ ఈవెంట్లలో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో భారత్‌ 13 గెలిస్తే, పాక్‌ రెండు మ్యాచ్‌ల్లోనే నెగ్గింది.

7 ఐసీసీ టోర్నీల్లో గత ఏడు మ్యాచ్‌ల్లోనూ పాక్‌పై భారత్‌దే విజయం.

20 ఐసీసీ, మేజర్‌ టోర్నీ ఫైనల్స్‌లో భారత్‌ రికార్డిది. 2007 టి20 ప్రపంచకప్‌ తుది పోరులో, 1985 ‘వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ క్రికెట్‌’ ఫైనల్లో భారత్‌దే గెలుపు.

4చాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్స్‌కు చేరడం ఇది నాలుగో సారి. 2000లో కివీస్‌ చేతిలో ఓటమి, 2002లో లంకతో సంయుక్త విజేత, 2013లో ఇంగ్లండ్‌పై గెలుపుతో విజేత.


1098
ఈ టోర్నీలో 91.50 అత్యుత్తమ బ్యాటింగ్‌ సగటుతో భారత్‌ చేసిన మొత్తం పరుగులు 1098. ఇందులో ధావన్, రోహిత్, కోహ్లిల వాటానే 874.

3 ఇండో, పాక్‌ సమరంలో ఇప్పటివరకు జునైద్‌ బౌలింగ్‌లో 2 పరుగులకు మించి చేయని కోహ్లి మూడుసార్లు ఔటయ్యాడు.

మధ్యాహ్నం గం. 3.00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం


టాగ్లు: India,Pakistan,Champions Trophy,భారత్‌,పాకిస్తాన్‌,చాంపియన్స్‌ ట్రోఫీ

మరిన్ని వార్తలు


మెయిడిన్ తో ఆరంభించారు..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న ఫైనల్ పోరును భారత్ జట్టు ...

నో బాల్ వేశారు.. లైఫ్ ఇచ్చారు..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న తుది పోరులో పాకిస్తాన్ ...

'చాంపియన్స్' ఎవరు?
చాంపియన్స్ ట్రోఫీలో అసలు సిసలు పోరుకు రంగం సిద్ధమైంది. ...

ఉత్కంఠ పోరు.. ఎవరిదో జోరు
దాయాదుల సమరం కోసం క్రికెట్‌ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ...

అంకెల్లో భారత్‌ విజయాలు
దాయాదుల పోరుకు సర్వం సిద్దమైంది. మరికొద్ది సేపట్లో మహా సంగ్రామం ప్రారంభం కానుంది. ...

అతను మ్యాచ్‌ ఫినిషర్‌
చాంపియన్‌ ట్రోఫీలో వరుసగా విఫలమౌతున్న భారత్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌ ...

'పాకిస్తాన్ పేసర్ల భయం అక్కర్లేదు'
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ బౌలింగ్ ను చూసి భారత జట్టు ఏమాత్రం ...

నా ఉద్దేశం అది కాదు: అమిర్ సొహైల్
చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఫైనల్ కు చేరిందంటే అందుకు కారణం బయట శక్తుల ...

'భారత్ కు ముందు బ్యాటింగ్ ఇవ్వకండి'
చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ జట్లు ఫైనల్ కు చేరిన క్రమంలో తమ తమ ...

ఫైనల్ మ్యాచ్ ఫలితంపై కోహ్లీ జోస్యం
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫైనల్ చేరిన పాకిస్తాన్, భారత్‌లు పూర్తి స్థాయిలో కసరత్తులు ...



ఈరోజు ....


  భారత్
X
  పాకిస్తాన్

Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 1.37
PAK 3 2 1 4 -0.68
SA 3 1 2 2 0.16
SL 3 1 2 2 -0.79

© Copyright Sakshi 2017. All rights reserved.